చికిత్స కోసం వస్తే ఏఆర్ కానిస్టేబుల్ మృతి

ఇంజక్షన్ ఇచ్చి డిశ్చార్జ్ చేసిన కొద్దిసేపటికే ఘటన
ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

వికారాబాద్, ఆంధ్రప్రభ : చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరుకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నరేష్ ఛాతిలో నొప్పితో వికారాబాద్‌లోని మెడిక్యూర్ ఆసుపత్రికి వచ్చారు.

ఆసుపత్రిలో వైద్యులు నరేష్‌కు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే డిశ్చార్జ్ చేసిన కొద్దిసేపటికే ఆసుపత్రిలోనే నరేష్ కుప్పకూలి మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆలూరు గ్రామస్తులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు.