అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం
- అడవుల్లో ఆశాకిరణం
- నల్లమల చెంచు పెంటలకు జీవజలం
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
- చెంచు గిరిజనులకు త్రాగునీరు
- డిఈ హేమలత సేవలు అభినందనీయం
అచ్చంపేట,ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ సేవలో ముందున్న మహిళలను స్మరించుకునే వేళ, గ్రామీణ నీటీ పారుదల, మిషన్ భగీరథ శాఖలో అచ్చంపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సేవలందిస్తున్న హేమలత కృషి విశేషంగా నిలుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని లోతట్టు చెంచు పెంటల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఆమె చేసిన సేవలు స్థానిక ప్రజల, అధికారుల ప్రశంసలతో పాటు పలు రంగాలలోని అత్యుత్తమ సేవ పురస్కరాలు ఆమెను వరించాయి.
దట్టమైన అడవులు, రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యల మధ్య జీవిస్తున్న చెంచు గిరిజనులకు త్రాగునీరు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను గుర్తించిన హేమలత అధికారులు, సిబ్బందితో కలిసి పలు మార్లు నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.
చెంచు పెంటల్లో త్రాగునీటి కొరతను తీర్చేందుకు బావులను త్రవించడం, బోర్వెల్లు తవ్వించడం, నీటి నిల్వ ట్యాంకులు ఏర్పాటు చేయడం, పైపులైన్ల ద్వారా నీటిని అందించే చర్యలు చేపట్టారు. కష్టసాధ్యమైన ప్రాంతాల్లో కూడా పనులను వేగంగా పూర్తి చేయించి చెంచు కుటుంబాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందేలా కృషి చేశారు.
దీంతో గతంలో త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే పరిస్థితి నుంచి చెంచు గిరిజనులు బయటపడ్డారు. ఇప్పుడు తమ గ్రామాల్లోనే త్రాగునీరు అందుబాటులో ఉండటంతో వారు హేమలత గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన సేవలు మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. నల్లమల అడవుల్లో చెంచు గిరిజనులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చిన హేమలత గారి సేవలు అందరి ప్రశంసలు అందుకోవడంతోపాటు ఎన్నో అవార్డులు సైతం ఆమెను వరించాయి
