Jharkhand | విద్యార్థిని మృతి..

Jharkhand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సన్‌వసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ బాలికల హాస్టల్‌లో నిద్రిస్తున్న నలుగురు విద్యార్థినులను రాత్రి విషపూరిత కట్లపాము కాటేసింది.

ఈ ఘటనలో 13 ఏళ్ల ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ఒక విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, మిగతా ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది.

ఘటనతో పాఠశాల ప్రాంగణంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. హాస్టల్‌లో పాము ఎలా ప్రవేశించిందనే కోణంలో విచారణ చేపట్టారు. విద్యార్థుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.