పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్యాం ప్రసాద్ లాల్ బాధ్యతల స్వీకరణ

పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్యాం ప్రసాద్ లాల్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ పదవి నుంచి బదిలీ అయిన ఆయనకు ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్యాం ప్రసాద్ లాల్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పాలనాపరమైన అనుభవం, పరిపాలనలో చురుకుదనం కలిగిన అధికారి గా పేరుగాంచిన శ్యాం ప్రసాద్ లాల్ నియామకంతో పౌరసరఫరాల శాఖ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు నిత్యావసర సరుకుల సరఫరా, రేషన్ వ్యవస్థ పారదర్శకత, పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నట్లు సమాచారం. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని శాఖ ఉద్యోగులు ఆకాంక్షించారు.
