యంత్రాంగం సిద్ధంగా ఉండాలి..

యంత్రాంగం సిద్ధంగా ఉండాలి..

విజయనగరం, ఆంధ్రప్రభ:
ఖరీఫ్ ధాన్యం సేకరణ లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. ఆ మేరకు యంత్రాంగమంతా సిద్ధంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాకు -కామన్ వెరైటీ రూ.2369/- గ్రేడ్ ఏ రూ. -2389/లు గా ఉంటుందని, ఇది గత ఏడాది కంటే 69 రుపాయలు ఎక్కువని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం సేకరణ పై కొనుగోళ్ళు కేంద్రాలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జే.సి మాట్లాడుతూ.. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏబీసీలుగా వర్గీకరించడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో సేకరణకు అవసరమగు సామగ్రిని, శిక్షణ పూర్తి చేసుకొని సిబ్బందిని సిద్ధంగా ఉండేలా చూడాలని మండల కమిటీలకు ఆదేశించారు. జిల్లాకు ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, 50 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాటిని సేకరించవలసి ఉంటుందని అన్నారు. 2 వేల వరకు వాహనాలను సిద్ధం చేయడం జరిగిందని, ఈ వాహనాలన్నీ జేపీఎస్ పద్ధతిలో పని చేస్తాయని అన్నారు. 159 మిల్లులను గుర్తించడం జరిగిందని, వాటి సామర్ధ్యాన్ని బట్టి ధాన్యం సిద్ధం చేయవలసి ఉంటుందని తెలిపారు.

ఈ ఏడాది ఆర్ఎస్కేలలో ఉండే తేమ యంత్రాలనే మిల్లుల వద్ద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నవంబర్ 2వ వారం నుండి సేకరణ కేంద్రాలు ప్రారంభం అవుతాయని, విజిలెన్సు బృందాలని, రాష్ట్ర, సరిహద్దుల వద్ద, చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటు చేయాలనీ ఆర్డీఓలకు సూచించారు. ఐఈసి మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందని, మండలాల్లో, గ్రామాల్లో ప్రతి రైతుకు సేకరణ పై పూర్తి స్థాయి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. సాంకేతిక సిబ్బంది యాప్స్, పోర్టల్స్ , ఎస్ఓపి , లాగిన్ ల పై అవగాహన కలిగించుకొని సమర్ధవంతంగా పని చేయాలనీ, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. చెల్లింపులు 48 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.