Shabad | ఉస్మానియాకు తరలించిన ఆరు మృతదేహాలు..

నర హంతకుని కోసం పోలీసుల వేట…
ఏడు బృందాల ఏర్పాటు..
స్వయంగా పర్యవేక్షి స్తున్న
కమిషనర్ తరుణ్ జోషి..


Shabad | (ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి ) : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో మృతదేహాల పోస్టుమార్టంపై డాక్టర్ పేచీ పెట్టడంతో శవాలను ఉస్మానియాకు తరలించారు. చేవెళ్లలో పోస్టుమార్టం చేస్తే గొడవలు జరిగే అవకాశం
ఉండటంతో షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో స్థానికంగా పోస్టుమార్టం నిర్వహించడం వల్ల ఆసుపత్రిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, రోగులకు కూడా ఇబ్బందులు కలగవచ్చని భావించిన స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించినట్లు సమాచారం.

దీంతో షాబాద్ పోలీసులు ప్రత్యామ్నాయంగా ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, షాబాద్ మండలంలోని దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి తనపై నమోదైన పోక్సో కేసుపై కక్ష పెంచుకుని, కేసు పెట్టిన కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికను పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం, తన భార్య సరిత (30), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2)లను కూడా హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మీ (45), 17 ఏళ్ల బాలికతో పాటు నిందితుడి భార్య, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

నర హంతకుడు కోసం వేట…
ఆరుగురిని దారుణంగా హత్య చేసిన రాజ్ కుమార్ ను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఏడు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. తొందరలోనే నిందితుడిని అరెస్టు చస్తామనే ధీమాతో పోలీసులు ఉన్నారు..