Pawan Kalyan Surgery | పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష
Pawan Kalyan Surgery | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు శనివారం ఉదయం ముంబయిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాలకు తీవ్రంగా ఉన్న రొటేటర్ కఫ్ గాయాల కారణంగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఆపరేషన్ సుమారు మూడుున్నర గంటలపాటు కొనసాగినట్లు తెలిసింది.
పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశం విడుదల చేశారు. “గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఈ సమయంలో ఆయనకు మనోధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.
