Tuni | నాలుగో సారి సేమ్ సీన్ – తుని వైస్ ఛైర్మ‌న్ ఎన్నిక వాయిదా

( ఆంధ్రప్రభ, తుని ప్రతినిధి) : తూర్పు గోదావరి జిల్లా తునిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారా స్థాయికి చేరింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ ఈ రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులతో నువ్వా నేనా అనే రీతిలో రెచ్చిపోగా .. అధికారులు ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. ఈ స్థితిలో టీడీపీ, వైసీపీ మధ్య రచ్చ జరిగింది. ఎన్నిక జరగనీయటం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మంగళవారం ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. ఎన్నిక జరగకుండా వైసీపీ అడ్డుకుంటోందని టీడీపీ కౌన్సిల‌ర్లు మండిపడుతున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు నెట్టివేశారు. కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక కోసం వెళ్లడానికి ప్రయత్నించగా.. మళ్లీ కౌన్సిలర్లను వైసీపీ దాచేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ఓటమి భయంతో వైసీపీ మాత్రం ఎన్నికకు రాకుండా రకరకాల డ్రామాలు ఆడుతోందని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్లను ఎందుకు నిర్బంధిస్తూ రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ వైపు మొగ్గు చూపుతార‌నే..
మంగళవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 10 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వెళ్లారు. వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు టీడీపీ వైపుకు మొగ్గు చూపుతారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లను వైసీపీ చైర్మన్ నివాసంలో దాచేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలుకొడుతూ టీడీపీ శ్రేణులు వైసీపీ కౌన్సిలర్లు ఉన్న ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. తాము ఎన్నికకు సిద్ధమవుతుంటే ఎందుకు వైసీపీ కౌన్సిలర్లు పదే పదే దాస్తున్నారంటూ పోలీసులతో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. వైసీపీ కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లి ఎన్నికలకు హాజరుకావాలని కోరుతామని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఇరువర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకావ‌డానికి బయటకు రాగానే.. అది తెలుసుకున్న వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైస్ చైర్మన్ అంతా కలిసి వైసీపీ కౌన్సిలర్లను లాక్కెళ్లారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. అధికారులు మాత్రం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని 12 గంటల వరకు వేచి చూసి కోరం లేని పక్షంలో వాయిదావేస్తామని చెప్పారు.

కోరానికి 14 మంది కౌన్సిల‌ర్లు అవ‌స‌రం
తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్‌ ఎన్నికకు 28 మంది కౌన్సిలర్లు హాజరుకావాలి. కోరానికి కనీసం 14 మంది హాజరుకావాల్సి ఉండగా.. ఇప్పటికే టీడీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు సమావేశం లోపల ఉన్నారు. మరో నలుగురు కౌన్సిలర్లు హాజరైతే కోరం ప్రకారం ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. కానీ వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. ఈ స్థితిలో వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మరో వైపు తెలుగుదేశం కౌన్సిలర్లే ఎన్నికను అడ్డుకున్నారని వైసీపీ నేతలు ప్రత్యారోపణ చేశారు. కౌన్సిల్ కు వెళ్తున్న తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయటానికి యత్నించారని, ప్రాణ భయంతో తమ కౌన్సిలర్లు వెనుదిరిగారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ కౌన్సిల్ లో 30 స్థానాల్లో 30 మంది వైసీపీ కౌన్సిలర్లే గెలిచారని, ఇటీవల 10 మంది పార్టీ వీడి టీడీపీలో చేరారని, వీరితోనే ఈ రాద్ధాంతం జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు.

వైసీపీ చలో తునికి పోలీస్ బ్రేక్ ..

మరోవైపు.. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఛలో తునికి వైసీపీ పిలుపునిచ్చింది. ఇందుకు సంఘీభావం తెలుపుతూ అక్కడకు చేరుకున్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభాన్ని తుని రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. నోటీసు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా.. నోటీసు తీసుకోకుండానే ముద్రగడ వెనక్కి వెళ్లిపోయారు. ఛలో తునికి వచ్చిన వైసీపీ మాజీ ఎంపీ వంగా గీతను కూడా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గీత వెనక్కి వెళ్లిపోయారు. పిఠాపురం టోల్ గేట్ దగ్గర వైసీపీ నేతలు కన్నబాబు, ద్వారంపూడిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *