ఘనంగా హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం

  • 116వ వారానికి చేరిన భీమ్‌గల్ పెద్ద హనుమాన్ ఆలయం

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శనివారం 116వ వారానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొని శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

పారాయణం అనంతరం దేశంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా జీవించాలని భక్తులు శ్రీ ఆంజనేయస్వామివారిని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ప్రతి శనివారం నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఈ సామూహిక పారాయణం 116 వారాలకు చేరుకోవడం విశేషమని నిర్వాహకులు తెలిపారు. భక్తుల సహకారం, స్వామివారి అనుగ్రహంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. రానున్న వారాల్లో కూడా మరింత మంది భక్తులు పాల్గొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.