బెజ్జంకి మండలంలో వరుస చోరీయత్నాలు..
బెజ్జంకి మండలంలో వరుస చోరీయత్నాలు..
- మహిళల మెడల్లో బంగారు తాళ్లు లాక్కెళ్లిన దుండగులు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల పరిధిలోని చిలాపూర్, రేగులపల్లి గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు మహిళలపై దాడులకు పాల్పడి బంగారు పుస్తెల తాళ్లు లాక్కెళ్లిన ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలపై బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
చిలాపూర్ గ్రామానికి చెందిన కొత్త తారవ్వ తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న బంగారు తాడును లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మేల్కొనగా, దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.
అదే గ్రామానికి చెందిన తడిమేలపల్లి లక్ష్మి (నిశాని మణెమ్మ) ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు తెలిపారు.
ఇక రేగులపల్లి గ్రామానికి చెందిన భూపతి లాస్య ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో కూడా ఇదే తరహాలో దుండగుడు సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెతికినప్పటికీ దుండగుల ఆచూకీ లభించలేదు.
ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాలను పరిశీలిస్తూ సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో దుండగుల కదలికలను గుర్తించే పనిలో ఉన్నారు. నిందితులను త్వరలో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల పరిసరాల్లో సరిపడ లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
