నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను
దక్షిణాదిలో రానున్నది కమలమే
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఆంధ్రప్రభ : చెన్నైలో జరిగేది దొంగల ముఠా సమావేశమని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. చెన్నైలో జరిగేది డీలిమిటేషన్ సమావేశం కాదని, చంబల్ లోయ ముఠా సమావేశమని అన్నారు. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కాంల నుండి బయటపడే దానిపైనే ఈ సమావేశం జరుగుతందన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని, డీలిమిటేషన్ పై ఇంతవరకు గైడ్ లైన్స్ వెలువడనే లేదని చెప్పారు. ఆలు లేదు..చూలు లేదు..అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ప్రతిపక్షాల తీరుందని అన్నారు.
రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం
డీఎంకే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందని బండి సంజయ్ అన్నారు. అనేక అవినీతి కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయిందన్నారు. రానున్న న్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని చెప్పారు. ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కేసులను కాంగ్రెస్ నీరుగారుస్తోందని, ఆరు గ్యారంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్నారు. చెన్నైలో ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు. లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారన్నారు. దక్షిణాదిలో వికసించేది కమలమే అని జోష్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని స్పష్టం చేశారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరులో పంట పొలాలను ఆయన పరిశీలించారు. గత రాత్రి కురిసిన వర్షాలకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టంపై రైతులతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర పభుత్వం ఇకనైనా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. పంట పొలాలను అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వారం రోజుల్లోగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలని కోరారు.