ఏలూరులో సంచలన మోసం!
- కస్టమర్ల బంగారంతో కిలాడీ గేమ్.. రూ.10 కోట్ల స్కామ్ బట్టబయలు!
- లాకర్లలో రోల్డ్ గోల్డ్.. అసలు బంగారం మాయం
- అప్రైజర్ రాజా గుట్టురట్టు..
- 4 కిలోల బంగారం, రూ. 10 లక్షల క్యాష్ రికవరీ
ఆంధ్రప్రభ, ఏలూరు బ్యూరో: సామాన్యుడు తన కష్టార్జితాన్ని తెచ్చి బ్యాంకులో పెడితే భద్రంగా ఉంటుందనే నమ్మకానికి నిలువెత్తు సున్నం పెట్టాడు ఓ అప్రైజర్. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో కంచె చేను మేసిన చందంగా సాగిన రూ. 10 కోట్ల భారీ గోల్డ్ లోన్ మోసం కథ వింటే సామాన్య జనం గుండెలు గుభేల్ అంటున్నాయి. నమ్మకమైన ఉద్యోగి లాగా నటిస్తూ.. వందలాది మంది కస్టమర్ల పసిడి కష్టాన్ని నొక్కేసిన గోల్డ్ అప్రైజర్ వలపాక రాజా ఖేల్ ఖతమైంది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మీడియా ముఖంగా శుక్రవారం వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత నేతృత్వంలోని పోలీస్ నెట్‌వర్క్ ఈ మెగా స్కామ్‌ను డేగకన్నుతో వేటాడి బట్టబయలు చేసిందన్నారు.
తిమ్మిని బమ్మి చేసిన రాజా గారడీ..
జంగారెడ్డిగూడెంలోని వెలమపేటకు చెందిన వలపాక రాజా (40) సదరు బ్యాంకులో తాకట్టు పెట్టే బంగారం అసలుదో, కాదో పరీక్షించే సీట్లో కూర్చున్నాడు. ఇదే అదనుగా భావించిన ఈ కిలేదార్ సామాన్యులు లోన్ కోసం తెచ్చిపెట్టిన ఒరిజినల్ బంగారు నగలపై కన్నేశాడు. ఎవరికీ ఏమాత్రం డౌట్ రాకుండా సీక్రెట్‌గా లాకర్ల నుండి ఒరిజినల్ నగలను మాయం చేసి, ఆ ప్లేస్‌లో నకిలీ రోల్డ్ గోల్డ్ ఆభరణాలను, ఇత్తడి ముక్కలను సర్దేసి పెద్ద గారడీనే చేశాడు. బ్యాంకు అధికారులు జరిపిన ఇంటర్నల్ ఆడిట్‌లో ఈ ఘోరం బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, ఏకంగా 176 మంది లోన్ అకౌంట్లలోని 6 కిలోల 449.50 గ్రాముల అసలు బంగారం మాయమైనట్లు తేలింది. దీని మార్కెట్ విలువ అక్షరాలా రూ. 10 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
బంగారు దుకాణాల్లో వేట.. ఖాకీల షాక్ ట్రీట్మెంట్..
నొక్కేసిన సామాన్యుడి సొమ్ముతో రాజా విలాసాలు మొదలుపెట్టాడు. ఆ బంగారాన్ని జంగారెడ్డిగూడెంలోని పలు ప్రముఖ బంగారు దుకాణాల్లో తన పేరుతో, తన కుటుంబ సభ్యుల పేరుతో అమ్మేసి, తాకట్టు పెట్టేసి క్యాష్ చేసుకున్నాడు. రంగంలోకి దిగిన ఏఎస్పీ సుస్మిత టీమ్, నిందితుడిని పక్కా ప్లానింగ్‌తో కటకటాల్లోకి నెట్టారు. దీంతో అసలు నిజాలు బట్టబయలయ్యాయి. మెరుపు వేగంతో ఆయా బంగారు దుకాణాలపై దాడులు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుండి రూ. 10 లక్షల హార్డ్ క్యాష్‌తో పాటు, ఏకంగా 4.120 కిలోల అపహరించిన బంగారాన్ని మెరుపు వేగంతో రికవరీ చేశారు. సీజ్ చేసిన ఈ సొత్తు విలువ రూ. 5.81 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.
రాత్రింబవళ్లు శ్రమించిన ఖాకీలు..
రికార్డు టైమ్‌లో ఈ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, సీఐ సుభాష్, ఎస్సైలు వీరప్రసాద్, కుటుంబరావు, జబీర్, వల్లీ పద్మ, ఏఎస్సైలు సంపత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, కానిస్టేబుళ్లు కిషోర్ , రమేష్ , దిలీప్ , అబ్బులు , రామాంజనేయులు, జగదీష్ , సత్యనారాయణ, మణికంఠ, రవికుమార్ తదితరులను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ , అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు మనస్ఫూర్తిగా అభినందించారు. సామాన్యుల నమ్మకాన్ని, ప్రజల సొమ్మును దోచుకునే ఆర్థిక నేరగాళ్లతో ఏలూరు జిల్లా పోలీసులు రాజీ పడే ప్రసక్తే లేదని, ఇటువంటి మోసాలకు పాల్పడితే ఎంతటి వారైనా కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని ఎస్పీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

