KTR Convoy | ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు

కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తుండగా యాదాద్రి జిల్లాలో ఘటన
కొంపల్లి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

KTR Convoy | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు (కేటీఆర్)తో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆయనకు ఛాతి భాగంతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన నాయకుల బృందంలో ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వీరా హోటల్ సమీపంలో కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కిందపడిపోవడంతో ఛాతి భాగంతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న పార్టీ నాయకులు, భద్రతా సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో వైద్యులు శంభీపూర్ రాజుకు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవసరమైన వైద్య పర్యవేక్షణలో ఆయనను ఉంచినట్లు సమాచారం.

ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేఎస్ వివేకానంద కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శంభీపూర్ రాజును పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.