ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘సర్’
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు సర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్‌లో నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు.
అనంతరం డివిజన్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం తీరును ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితా ఉండేలా చూడటమే కాకుండా అనర్హుల పేరు ఒక్కటి కూడా ఓటరు జాబితాలో ఉండకూడదన్నారు. ఒకే వ్యక్తి ఒక ఓటు కాకుండా పలు ప్రాంతాల్లో ఉన్న ఓట్లను గుర్తించి తొలగించడంతో పాటుగా మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడానికి ప్రజలు పూర్తిగా బీఎల్‌వోలకు సహకరించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసరి గాబ్రియెల్, సుగసాని రత్నశ్రీ కృష్ణప్రసాద్, మీరా, వెల్లంకి సుధాకర్, పూర్ణచంద్రరావు స్థానిక బి.ఎల్.ఒ., బి.ఎల్.ఎ.లు తదితరులు పాల్గొన్నారు.
