భూ భారతి రీ-సర్వేపై రైతులకు అవగాహన..

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి భూముల రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ధమ్మనపేట్ రెవెన్యూ గ్రామం ఎంపికైన సందర్భంగా శుక్రవారం గ్రామసభ నిర్వహించారు.

ఉప్లూర్ గ్రామ ఉపసర్పంచ్ తక్కురి ముత్యం అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో భూ రీ-సర్వే ప్రక్రియ, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూముల వివరాల నమోదు తదితర అంశాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.

రీ-సర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూమికి కొత్త భూధార్ నంబర్ కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అలాగే సంబంధిత రైతు భూమిని సర్వే చేసే ముందు, ఆ భూమికి ఆనుకుని ఉన్న రైతులకు ఒక రోజు ముందుగానే సమాచారం అందజేసి, వారి సమక్షంలో సర్వే నిర్వహిస్తామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ ఎం. జగదీశ్వర్, తహసీల్దార్ నరేష్, ఆర్‌ఐ శరత్ కుమార్, డీఐ శేఖర్ వర్మ, సర్వేయర్ బాలు, జీపీఓ సుమన్, వార్డు సభ్యులు ఆంజిత్, సురేష్, సాధుల్లా, రైతులు కొమ్ముల రవీందర్, పాలేపు మురళి, నగేష్, బజాన్న, శేఖర్, అనిల్, విఠల్, భాస్కర్, గంగారాం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.