రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు అందించాలి..
మోత్కూర్, ఆంధ్రప్రభ : ఖరీప్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలని, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు ఎరువుల సరఫరాకు పాల్పడుతున్న వ్యాపారులపై పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం మోత్కూర్ లో ఆయన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రబీ దాన్యం కొనుగోలు పక్రియ ఇప్పటికి పూర్తి కాలేదని విమర్శించారు.
దాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక , శారీరక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వ్యవసాయానికి కీలకమైన ఖరీప్ సీజన్ ప్రారంభమైనప్పటికి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాలో స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా కల్తీ విత్తనాలు నాసిరకం ఎరువుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి కల్తీ సరుకుల విక్రయాలను అరికట్టాలని కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులను సబ్సిడీపై అందుబాటులో ఉంచి ఖరీప్ సాగుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
