విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ

మోత్కూర్, ఆంధ్రప్రభ: విద్యార్థుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్‌ ఐదో వార్డు కౌన్సిలర్‌ మొగుళ్ల అనురాధ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మండలంలోని బుజిలాపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో ఆమె స్వయంగా విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నులిపురుగుల కారణంగా పిల్లల్లో ఎదుగుదల మందగించడం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రలు మింగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.