కూతురును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎర్ర శంకర్ తన కుమార్తె ఎర్ర వర్షిణిని అదే ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద రాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ప్రజలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరింత నమ్మకం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్య, శంకర్, ఇండ్ల రాంప్రసాద్, వెంకటయ్య, జినుకల ప్రవీణ్, బత్తిని రామకృష్ణ, మొలకల వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
