ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు..
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు..
సంతపేట–చవటపల్లి రోడ్డుకు శ్రీకారం
చిత్తూరు అభివృద్ధిలో రాజీ లేదు: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అభివృద్ధి పనుల్లో వెనుకడుగు వేయబోమని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా సంతపేట, చవటపల్లి ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే చొరవతో రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. బుధవారం ఉదయం సంతపేట ముత్యాలమ్మ ఆలయం సమీపంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, స్థానిక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాధారణ రహదారి కంటే సిమెంట్ రోడ్డు నిర్మాణమే శాశ్వత పరిష్కారమని భావించి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కొంత ఆలస్యమైనప్పటికీ నాణ్యమైన రోడ్డు నిర్మాణమే లక్ష్యమని చెప్పారు.
గత రెండేళ్లలో సంతపేట ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు, గాంధీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశామని తెలిపారు. కొత్తగా మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని సంతపేట ప్రాంతంలో నిర్మిస్తున్నామని, ప్రజల తాగునీటి అవసరాల కోసం భారీ నీటి ట్యాంకు, పైప్లైన్ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
నగరాభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. చిత్తూరు నగరంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, టీడీపీ పరిశీలకురాలు పురిమిట్ల కుమారి, ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
