స్వాతంత్ర్య స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలి: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి (ఆంధ్రప్రభ): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాతృభూమి కోసం ఎందరో మహనీయులు ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించిన స్వాతంత్ర్యాన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విలువలను కాపాడుకోవాలని సూచించారు. దేశ భద్రతలో అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జాతీయ పండుగలు మన విధులను, సమాజానికి అందించాల్సిన సేవలను గుర్తుచేసే వేడుకలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, సామరస్యం, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నిబద్ధతతో, నిజాయితీగా విధులు నిర్వహించడం ద్వారా దేశ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఏఆర్ డీఎస్పీ ఎ. నరేందర్, వివిధ విభాగాల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.