అమరవీరుల త్యాగాలు వృధా కావు: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
హనుమకొండ జిల్లా, పరకాల (ఆంధ్రప్రభ బ్యూరో): పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. వారి ఆశయాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. లక్షలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మితమైన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత గాథలు నేటి తరానికి ఆదర్శమని, వారి దేశభక్తి, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
