Rajasthan | ఇసుక తుఫాను బీభత్సం…

Rajasthan | ఇసుక తుఫాను బీభత్సం…

  • పట్టపగలే చీకటిమయమైన చురూ..
  • జీరో విజిబిలిటీతో స్తంభించిన జనజీవనం

చురూ/జైపూర్, ఆంధ్రప్రభ : రాజస్థాన్‌లో చురూ జిల్లాను ఒక భారీ ఇసుక తుఫాను (Sandstorm) ముంచెత్తింది. భారీ ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో, పట్టపగలే రాత్రిని తలపించేలా పూర్తిగా చీకటి అలుముకుంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులు చురూ పరిసర ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. దాదాపు అరగంట పాటు చురూ ప్రాంతం కేవలం ఇసుక మేఘాల మధ్యే ఉండిపోయింది.

జీరో విజిబిలిటీ.. నిలిచిపోయిన వాహనాలు

ఈ ఇసుక తుఫాను కారణంగా విజిబిలిటీ (కంటిచూపు మేర కనిపించే దూరం) దాదాపు శూన్యానికి (Near-Zero) పడిపోయింది. ఎదురుగా ఉన్న వాహనాలు కానీ, మనుషులు కానీ కనీసం కొన్ని మీటర్ల దూరంలో కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో హైవేలపై వెళ్తున్న వాహనదారులు తమ వాహనాల లైట్లు ఆన్ చేసి, ఎక్కడికక్కడ నిలిపివేయాల్సి వచ్చింది. తీవ్రమైన దుమ్ము కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

స్తంభించిన విద్యుత్ వ్యవస్థ, విరిగిపడిన చెట్లు

బలమైన గాలుల కార‌ణంగా.. చురూ, సర్దార్‌షహర్ వంటి ప్రాంతాల‌తో పాటు అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతినడంతో నగరంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇసుక తుఫానుతో పాటు బికనీర్, శ్రీగంగనగర్ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు… కొన్నిచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి.

రాబోయే 4-5 రోజుల పాటు రాజస్థాన్‌లోని బికనీర్, జైపూర్, అజ్మీర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ విభాగాలలో ఈ తరహా ఈదురు గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Leave a Reply