ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలి..

ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలి..

  • బికెయంయు జాతీయ సమితి సమావేశాలలో వెంకట్రాములు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది శ్రమజీవులైన వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)ను రద్దు చేసి, దాని స్థానంలో వీబీజీఎఫ్ (విజన్ భారత్ గ్రామీణ యోజన) తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు విమర్శించారు.

ఒంగోలులో మూడు రోజులపాటు జరుగుతున్న భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జాతీయ సమితి సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు పెరిన్ స్వామి అధ్యక్షత వహించారు. శనివారం జరిగిన సమావేశంలో గ్రేటర్ వరంగల్‌కు చెందిన తాటిపాముల వెంకట్రాములు ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని కోరారు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు భూమి సమస్య, సామాజిక సమానత్వం తదితర అంశాల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు రెండున్నర సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.

ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి సంవత్సరానికి రూ.12,000, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, సామాజిక పెన్షన్లు నెలకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్, చేతివృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు.

ఈ పరిస్థితుల్లో ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేయాలని, అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు నిర్వహిస్తోందని, లక్ష్యాలు సాధించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని వెంకట్రాములు తెలిపారు.

ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, జాతీయ నాయకులు వి.ఎస్. నిర్మల్, జానకి పాశ్వాన్, ఆవుల శేఖర్, తెలంగాణ నుంచి జాతీయ సమితి సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, అక్కపెల్లి బాపు, తోటపల్లి శంకర్, సిలువేరు విజయతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సమితి సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.