విద్యార్థుల వస్తువుల టెండర్ల గోల్‌మాల్‌పై బహిరంగ చర్చకు సిద్ధం

  • ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: విద్యార్థులకు అందాల్సిన వివిధ వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తగిన సమయం, స్థలాన్ని ప్రకటిస్తే అన్ని ఆధారాలతో చర్చకు హాజరవుతామని పేర్కొన్నారు.

గురువారం టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మంత్రులకు తెలియకుండానే జీవో నెం.17 విడుదలైందని, దీనిపై సవాల్ విసురుతున్న మంత్రులు అజారుద్దీన్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్‌లకు సరైన అవగాహన లేదని ఆరోపించారు. మంత్రులకు ఈ జీవో గురించి ముందస్తు సమాచారం ఉంటే సంబంధిత సమావేశాల నిర్ణయాల పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కోటరీ సభ్యులైన వేమ్ నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ జీవోను తీసుకొచ్చారని, కాంట్రాక్టర్ల సూచనల మేరకు జీవోల్లో మార్పులు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన వారికే టెండర్లు దక్కేలా విధానం ఉండేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు కాకుండా ఢిల్లీ, హర్యానాకు చెందిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

టెండర్ల గోల్‌మాల్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అమరవీరుల స్థూపం వద్దగానీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దగానీ చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లు, లావాదేవీల వివరాలు, టెండర్లు పొందిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాములు, అవినీతి ఆరోపణలను వెలుగులోకి తీసుకొస్తుంటే సహనం కోల్పోయి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే వెంటనే అన్ని పత్రాలను ప్రజల ముందుంచాలని కోరారు.పాలమూరు బిడ్డగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ఈ రెండున్నర ఏళ్లలో పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.

తెలంగాణ ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకోవడాన్ని సహించబోమని, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తామని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజలను చైతన్యపరిచి వారితో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.