గద్వాల (ప్రతినిధి) ఏప్రిల్ 19 (ఆంధ్రప్రభ) : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం, ధరూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లురవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి గద్వాలకు హెలికాప్టర్ లో ఉదయం 9:30 నిమిషాలకు చేరుకున్న మంత్రికి, ఎంపీకి స్వాగతం పలికారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరితా తిరుపతయ్య.
అనంతరం గద్వాల నుంచి రోడ్డు మార్గాన ధరూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ భూభారతి చట్టంపై అవగాహన సదస్సుకు బయలుదేరి వెళ్లారు. అయితే సభా వేదికపైకి మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను, గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత తిరుపతయ్యను ఆహ్వానించకపోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను వేదికపైకి ఆహ్వానించకపోవడంతో అసహనంతో ఆయన వెనుతిరిగి వెళ్లారు.
ఇదే సందర్భంలో సరితా తిరుపతయ్యను కూడా వేదికపైకి ఆహ్వానించకపోవడంతో ఎంపీ మల్లు రవితో సరిత తిరుపతయ్య వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నటువంటి సరితా తిరుపతయ్యను వేదిక పైకి ఆహ్వానించక పోవడంతో ఆమె వర్గీయులు వేదికపైకి ఆహ్వానించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలో పోలీసు యంత్రాంగం కలగజేసుకొని ఎలాంటి గొడవలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
