Rs.43.79 cr | యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం..

Rs.43.79 cr | యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం..
రూ.99.55 కోట్లతో ఆలయ అనుబంధ పనులు
శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కంచికామకోటి పీఠాధిపతితో కలిసి పర్యటన
వేద విజ్ఞాన పరివ్యాప్తికి ప్రత్యేక పాఠశాల
Rs.43.79 cr | ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో సంప్రదాయ వేద విద్యను బోధించే గురుకులం ఏర్పాటవ్వనుంది. రూ.43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయనగరి లేఅవుట్ వద్ద 15ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నటువంటి వేద పాఠశాల భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిశనివారం శంకుస్థాపన చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. మొత్తంగా రూ.100 కోట్లతో చేపట్టే పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమిపూజలో పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా 99.55 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.43.80 కోట్లతో అత్యాధునిక వసతులతో వేద పాఠశాల నిర్మాణం. రూ.43.12 కోట్లతో భక్తులు, దీక్షాపరుల వసతి కోసం ప్రత్యేక సదనాలు, కొండపై స్వామివారి నిత్య కల్యాణాల నిర్వహణ కోసం రూ.9.87 కోట్లతో మండప నిర్మాణం, వైకుంఠ ద్వారం నుండి కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రూ.1.41 కోట్లతో పైకప్పు నిర్మాణం పనులు చేపట్టనున్నారు. అలాగే రథశాల వైపు ఉన్న మాడవీధులకు రూ.1.35 కోట్లతో మెట్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, యాదాద్రిని మరింత ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి.
Rs.43.79 cr | వేదవిజ్ఞాన పరివ్యాప్తికి ప్రత్యేక పాఠశాల
తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా వేదవిజ్ఞాన పరివ్యాప్తికి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన వేదపాఠశాల నెలకొల్పాలని సంకల్పించారు. దానిలో భాగంగా స్వామివారు కొలువైన యాదగిరికొండకు అభిముఖంగా ఉన్న పెద్దగుట్ట టెంపుల్‌సిటీ లేఅవుట్ వద్ద 15ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాలను నిర్మించనున్నారు. రూ.43.80కోట్ల అంచనా వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయం నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి యాదగిరిగుట్ట దేవస్థానం కేవలం రూ.5కోట్లు కేటాయిస్తుండగా, మిగతా నిధులు దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయోనిధి( సీజీఎఫ్) నుంచి నిధులు సమకూర్చుతున్నారు.
ఆశ్రమ గురుకుల విద్యా బోధనా పద్ధతిలో 300 మంది విద్యార్థులకు, వేద బోధన అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అవసరమైన వసతులు ఏర్పాటు కానున్నాయి. సువిశాల బోధనా మందిరాలు, సమావేశ మందిరం, వసతి భవనాలు, భోజనం సిద్ధం చేయడానికి సువిశాలమైన వంటగది, హోమాలు, యాగాలకు ప్రత్యేక శాలలతోపాటు గోశాలను నిర్మించనున్నారు.
Rs.43.79 cr | వేదాల అభ్యసనానికి..
వేద పాఠశాలలో చేరే విద్యార్థులకు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలతో పాటు.. ఆగమ శాస్త్రాలను కూడా బోధిస్తారు. ఇది తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేద పాఠశాలగా నిలవనుంది. వచ్చే రెండేళ్లలో వేదపాఠశాల నిర్మాణం పూర్తిచేసి తరగతులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు రూ.1.41 కోట్లతో మెట్లమార్గానికి పైకప్పు, రూ.1.44 కోట్లతో మాడ వీధులకు మెట్లు, రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండలం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న వేదపాఠశాలలో కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో బోధన చేపట్టనున్నారు.
రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంతోపాటు ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు వీలు కల్పించి విద్యార్థులకు పట్టాలు అందించనున్నారు. కాగా, ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట పెద్దగుట్టపైకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేంనరేందర్ రెడ్డి.. యాదాద్రికి చేరుకున్నారు. వారంతా రేవంత్ తో అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు.
CLICK HERE TO READ MORE ; criticized | హరీశ్‌రావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
