తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం
రైతుపేటలో కీసర పంపింగ్ మెయిన్ పనులకు శంకుస్థాపన..
రూ.39.50 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభం…
ప్రజలకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
ఆంధ్రప్రభ నందిగామ : నందిగామ పట్టణంలోని రైతుపేట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. రూ.39 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టనున్న కీసర పంపింగ్ మెయిన్ పనులకు తంగిరాల సౌమ్య గురువారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సౌమ్య, ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుపేట ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
