త్రిశూల్ ఏర్పాటుతో ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాసగిరి

త్రిశూల్ ఏర్పాటుతో ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాసగిరి

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: దేశంలో వివక్ష లేని పాలన కొనసాగుతుందని తెలంగాణలో తాజాగా ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. సోమవారం విశాఖలో కైలాసగిరిపై తాజాగా ఏర్పాటు చేసిన త్రిశూల్ వద్ద సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ బీజేపీ అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలో దేశంలో ఉగ్రవాద అణచివేతనిర్దాక్షిణ్యంగా జరుగుతుందన్నారు. అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని అందువల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగలుగుతున్నామన్నారు. సోమనాథ్ ఆలయ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కైలాసగిరిపై త్రిశూల్ ఏర్పాటు కావడం శుభపరిణామం అని మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుతో సింహాచలం కొండలో భాగమైన కైలాసగిరి పూర్తిస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. కైలాసగిరిపై అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రిశూలాన్ని ఏర్పాటు చేసినందుకు విఎంఆర్డీఏను ఆయన అభినందించారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని, అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అది ప్రారంభమైందని గుర్తు చేశారు.

వందల ఏళ్ల దాడుల వల్ల కోల్పోయిన అస్తిత్వాన్ని పునర్నిర్మాణం ద్వారా ఆలయం తిరిగి పొందిందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మోదీ పిలుపు మేరకు స్వాభిమాన్ పర్వ్ తో పాటు స్వాభిమాన్ జాగరణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌కు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ ఏ. కేశవకాంత్, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ప్రకాష్ రెడ్డి, బీజేపీ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి విజయానంద రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధం లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ బొచ్చా సురేష్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వరరావు, బీజేపీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి రవి రాజ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply