రైతులను దోచుకుంటే ఉపేక్షించం..

రైతులను దోచుకుంటే ఉపేక్షించం..

— కాంటా వేసిన తర్వాత రైతుకు సంబంధమేంటి..?
— తాలు, తరగు పేరుతో దోపిడీపై మిల్లర్లకు ఎమ్మెల్యే గండ్ర హెచ్చరిక

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : తాలు, తరగు పేరుతో రైతులను దోపిడీకి గురిచేస్తే ఎంతమాత్రం సహించబోమని గండ్ర సత్యనారాయణ రావు రైస్ మిల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని లాభాల కోసం దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ధాన్యం, మక్కల కొనుగోళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, డీఆర్‌డీఓ, సహకార శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంటా వేసిన తర్వాత రైతుకు సంబంధమేంటి..?

కాంటా వేసిన తర్వాత రైతుకు సంబంధమేంటి..? ట్రక్ షీట్ ఎందుకు ఇవ్వడం లేదు..? అంటూ అధికారులను, మిల్లర్లను ఎమ్మెల్యే నిలదీశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం, మక్కల కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఈ 30 రోజులు కీలకమని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు మిల్లర్లు తాలు, తరగు పేరుతో రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కొనుగోలు కేంద్రంలో కాంటా పూర్తైన తర్వాత ధాన్యం భద్రత, రవాణా బాధ్యత పూర్తిగా మిల్లర్లు, కేంద్ర ఇంచార్జిలదేనని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే నష్టపోతుండగా మరింత వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. గోదాములు, రవాణా, కాంటా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రవాణాలో ఆటంకాలు సృష్టించే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రైతులకు 48 గంటల్లో నగదు జమయ్యేలా కొనుగోలు జరిగిన వెంటనే ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలని సూచించారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్‌ఓ వసంతకుమారి, పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, వ్యవసాయ అధికారి బాబూరావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, రవాణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని, డీఆర్‌డీఓ బాలకృష్ణ, సహకార అధికారి వాలియా నాయక్, డీపీఓ శ్రీలత , మిల్లర్లు కోరే రవి , రేపాల్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply