ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల కోసం విస్తృత ప్రచారం..

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం అధ్యాపకులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అజిత్ ఖాన్ మాట్లాడుతూ, నూతన విద్యా సంవత్సరం నుంచి ఐఎఫ్‌పీ, ఐడీపీల సహకారంతో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యాబోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈఏపీసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఖాన్ అకాడమీ సహకారంతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.

అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధనతో పాటు అత్యాధునిక సైన్స్ ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి శనివారం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణం ద్వారా నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్వాగత కిట్, తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ప్రాక్టీస్ వర్క్‌బుక్స్, ఒక జత యూనిఫాం అందించబడుతాయని తెలిపారు. సురక్షిత తాగునీరు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, బాలికలకు హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఏసీఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రంలో అడ్మిషన్ తీసుకుని అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ అజిత్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రంలో అడ్మిషన్ తీసుకొని విద్యా సౌకర్యాలను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎం. అజీజ్ బేగ్ గారు ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేసముద్రం సూచించారు.

Leave a Reply