భూగర్భ జలాల పరిరక్షణపై డిమాండ్లు

భూగర్భ జలాల పరిరక్షణపై డిమాండ్లు
అమరావతి, ఆంధ్రప్రభ : భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుధ్యం.. భవిష్యత్ నీటి భద్రత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కార్యాచరణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లలో ఈ విషయమై పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్, స్వచ్ భారత్ మిషన్ వంటి పథకాల ద్వారా రాష్ట్రాలకు సాంకేతిక మార్గదర్శకాలు, నిధులు, జియో-ట్యాగింగ్, మానిటరింగ్ వ్యవస్థలు అందిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.
2019 వరకు రాష్ట్రంలో సుమారు రెండు లక్షల ఇంకుడు గుంతలు నిర్మించినప్పటికీ అనంతరం కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ఉన్న నిర్మాణాలు పూడికతో నిండిపోయి నిర్వీర్యమయ్యాయన్నారు. 2024-25లో మళ్లీ భూగర్భ జల రీచార్జ్ కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ, అధికారులు అలసత్వంతో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు.
అధికారుల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సూచనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో రీచార్జ్ పిట్స్ అవసరం ఉన్నప్పటికీ, పనులు మొక్కుబడిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాణ్యత లేని నిర్మాణాలు, సాంకేతిక ప్రమాణాల లోపం, నిర్వహణ లేకపోవడం, పూర్తి కాని పనులను పూర్తి అయినట్లుగా చూపించడం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలొ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా “గ్రౌండ్‌వాటర్ రీచార్జ్ మిషన్” ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామానికి వార్షిక భూగర్భ జల రీచార్జ్ లక్ష్యాలు నిర్ణయించాలని, ప్రతి ఇంటికి రీచార్జ్ పిట్, సోక్ పిట్ తప్పనిసరి చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను తప్పనిసరి చేయాలన్నారు.
చెరువుల పూడిక తొలగింపు, కాలువల శుభ్రత పనులకు ఏటా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రతి నిర్మాణానికి జియో-ట్యాగింగ్, పబ్లిక్ మానిటరింగ్ అమలుతో పాటు, నాణ్యత తనిఖీలకు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. బావులు, బోర్లు ఎండిపోతున్న మండలాలకు ప్రత్యేక రీచార్జ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని మాధవ్ సూచించారు.
