ఆర్జీయూకేటీ ప్రవేశాలకు జూలై 9న ఐదో విడత కౌన్సెలింగ్

బాసర, జూలై 7 (ఆంధ్రప్రభ): రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో నాలుగో విడత పూర్తయినట్లు యూనివర్సిటీ ప్రజాసంబంధాల అధికారి బాలకృష్ణ మంగళవారం తెలిపారు. నాలుగో విడత అనంతరం మిగిలిన 29 సీట్ల భర్తీకి జూలై 9న ఐదో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అలాగే గ్లోబల్ కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లకు జూలై 10న ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జనరల్ లేదా గ్లోబల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్ణీత తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సంబంధిత ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను విద్యార్థులు ఆర్జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.