విద్యార్థులకు సైకిళ్లు.. గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్
నిజాంపేట, ఆంధ్రప్రభ: మండలంలోని నందిగామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో 12 సైకిళ్లు, యూనిఫాంలను పంపిణీ చేశారు. అలాగే నిజాంపేట గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్‌ను అందజేశారు. అనంతరం చల్మెడ కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే తన లక్ష్యమని, కంటారెడ్డి ట్రస్ట్ ద్వారా మెదక్ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సైకిళ్లు అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
