వైఎస్సార్‌కు వినతిపత్రం… కూటమి ప్రభుత్వంపై నిరసన..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు జిల్లా కోర్టు సెంటర్‌లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వైఎస్సార్ విగ్రహానికి ఒక వినతిపత్రాన్ని అంటించి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగాయని, ఎన్నికల హామీలు అమలు కావడం లేదని, సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని లేఖలో పేర్కొన్నట్లు నాయకులు తెలిపారు. ప్రజల తరఫున తమ గోడును వైఎస్సార్‌కు తెలియజేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
