RBI Credit Score Update | రుణ నిబంధనల్లో ఆర్బీఐ కీలక మార్పులు

RBI Credit Score Update | రుణ నిబంధనల్లో ఆర్బీఐ కీలక మార్పులు
RBI Credit Score Update | ఫోర్‌క్లోజర్ చార్జీలకు ఫుల్‌స్టాప్
వారం వారానికి క్రెడిట్ స్కోర్ అప్డేట్
నామినీల సంఖ్య పెంపుతో ఖాతాదారులకు ఊరట
నగల వ్యాపారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్
RBI Credit Score Update | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రుణాలు, క్రెడిట్ స్కోర్లు, బ్యాంకు నామినేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఈ మార్పులపై Reserve Bank of India (ఆర్బీఐ) ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిలో కొన్ని గత ఏడాది నవంబర్ నుంచే అమల్లో ఉండగా, మరికొన్ని ఈ ఏడాది జూలై నుంచి అమలుకానున్నాయి.
రుణ చెల్లింపుల్లో కీలక సడలింపులు
ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో తీసుకున్న రిటైల్ రుణాలను ఇకపై ముందుగానే చెల్లించినా అదనపు పెనాల్టీలు లేదా ఫోర్‌క్లోజర్ చార్జీలు విధించరాదు. ఈ సడలింపు జనవరి 1 తర్వాత మంజూరైన లేదా పునరుద్ధరించిన గృహ, వ్యక్తిగత, విద్య, వాహన రుణాలకు వర్తిస్తుంది. ఇప్పటివరకు చేతిలో డబ్బు ఉన్నప్పటికీ రుణాన్ని ముందే ముగించాలంటే భారీ ఫోర్‌క్లోజర్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో ఆ భారానికి పూర్తిగా చెక్ పడింది.
ఈ నిర్ణయం వల్ల రుణగ్రహీతలకు కలిగే ప్రయోజనాలు:
» అదనపు డబ్బు వచ్చినప్పుడు అప్పులను త్వరగా ముగించే వీలు
» వడ్డీ భారం తగ్గించుకునే అవకాశం
» బోనస్‌లు, అనుకోని ఆదాయాన్ని సమర్థంగా వినియోగించే సౌకర్యం
వారానికోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్
ఇప్పటి వరకు క్రెడిట్ స్కోర్లు నెలకు ఒక్కసారి మాత్రమే అప్డేట్ అయ్యేవి. అయితే జూలై 1 నుంచి క్రెడిట్ డేటా, స్కోర్ వివరాలు ప్రతి వారం నవీకరించబడనున్నాయి.
నామినేషన్ వ్యవస్థలో మార్పులు
బ్యాంకు ఖాతాలు, ఎఫ్‌డీలు, లాకర్ల నామినేషన్ల విషయంలో కూడా ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
కొత్త మార్పులు ఇలా ఉన్నాయి:
• ఖాతాదారులు ఇక నాలుగు మంది వరకు నామినీలను నమోదు చేయవచ్చు
• ఒకేసారి లేదా విడతల వారీగా నామినేషన్ చేసే అవకాశం ఉంటుంది
• ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆస్తుల బదిలీ సులభమవుతుంది
• ఎఫ్‌డీలు, లాకర్లలోని వస్తువులు వివాదాలు లేకుండా నామినీలకు బదిలీ చేయొచ్చు
క్రెడిట్ స్కోర్ మార్పుల్లో ఉన్న రిస్కులు
ఈ కొత్త వ్యవస్థలో ప్రయోజనాలే కాక కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం.
• ఒక ఈఎంఐ ఆలస్యమైనా వారంలోనే స్కోర్‌పై ప్రభావం పడుతుంది
• చిన్న పొరపాటుకే క్రెడిట్ రేటింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది
• సమస్యను సరిచేసుకునేందుకు సమయం తక్కువగా ఉంటుంది
నగల వ్యాపారులకు ఊరట
బంగారాన్ని హామీగా పెట్టి తీసుకునే రుణాల చెల్లింపు గడువును కూడా ఆర్బీఐ పెంచింది. గతంలో 180 రోజుల్లో చెల్లించాల్సిన ఈ రుణాలకు ఇప్పుడు 270 రోజుల గడువు వర్తిస్తుంది.
దీంతో నగల వ్యాపారులకు:
• నగదు నిర్వహణలో సౌలభ్యం
• రీఫైనాన్స్ ఒత్తిడి తగ్గింపు
• అదనపు నిధుల వినియోగానికి అవకాశం
ఇతర ప్రయోజనాలు
• మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారు తక్కువ వడ్డీ రేట్లపై చర్చించగలరు
• బ్యాంకులు నమ్మకమైన రుణగ్రహీతలను సులభంగా గుర్తించగలవు
• ప్రమాదకర రుణ ఖాతాలపై ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకునే వీలు ఉంటుంది
