AP Electric Buses | హరిత రవాణాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం
AP Electric Buses | హరిత రవాణాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం
AP Electric Buses | పీఎం ఈ-బస్ పథకంతో గ్రీన్ మొబిలిటీ వేగవంతం
750 విద్యుత్ బస్సులతో ప్రజా రవాణా విస్తరణ
చార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం
ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఏపీ అగ్రగామి
AP Electric Buses | అమరావతి, ఆంధ్రప్రభ : హరిత రవాణాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఈ-బస్ సేవా పథకం కింద విద్యుత్ మొబిలిటీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఆర్టీసీ వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
ఈ-ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సౌకర్యాల కోసం మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనుల పురోగతిపై శనివారం విద్యుత్ సౌధలో ఇన్చార్జి ఎండీ ఎం.టి. కృష్ణబాబుతో కలిసి డిస్కంల సీఎండీలు శివశంకర్ లోతేటి, పృథ్వి తేజ్ ఇమ్మడి, పి. పుల్లారెడ్డి, ట్రాన్స్కో, డిస్కంల, జోనల్ స్థాయి అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుస్థిర పట్టణ రవాణా వ్యవస్థల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక ప్రజా రవాణా సేవల విస్తరణకు పీఎం ఈ-బస్ పథకం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో హరిత రవాణా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని విజయానంద్ చెప్పారు.
కాలుష్య నియంత్రణ, స్వచ్ఛ ఇంధన వినియోగం, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడం లక్ష్యంగా విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థలను విస్తరించనున్నామని ఆయన వివరించారు.
750 విద్యుత్ బస్సులు
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని 11 నగరాలు, 12 డిపోలను కలుపుకుని మొత్తం 750 విద్యుత్ బస్సులను మంజూరు చేసిందని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. అదనంగా టెండర్ కింద ప్రత్యేక కేటాయింపుగా తిరుపతికి మరో 300 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయన్నారు.
విద్యుత్ మొబిలిటీ రంగంలో దేశంలో ముందంజలో నిలిచే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రగామిగా అవతరిస్తోందని వివరించారు. Visakhapatnam, Vijayawada, Guntur, Nellore, Kurnool, Kakinada, Rajamahendravaram, Kadapa, Amaravati, Tirupati, Anantapur వంటి ప్రధాన పట్టణాల్లో ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. విద్యుత్ బస్సుల కార్యకలాపాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అన్ని డిపోల్లో సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నామని విజయానంద్ తెలిపారు. ఈ పనులకు కేంద్ర సాంక్షనింగ్ అండ్ స్టీరింగ్ కమిటీ రూ.89.99 కోట్ల అంచనాకు గాను రూ.79.98 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.
ఈ పనుల్లో హైటెన్షన్ విద్యుత్ కనెక్టివిటీ వ్యవస్థలు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ నెట్వర్కులు, డిపో స్థాయి పవర్ మేనేజ్మెంట్ సదుపాయాల అభివృద్ధి వంటి కీలక అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. ట్రాన్స్కో, డిస్కంలతో సమన్వయం ద్వారా హైటెన్షన్ విద్యుత్ కనెక్టివిటీ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. సింహపురి, గాజువాక, కాకినాడ, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో బీటీఎం మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.17.86 కోట్లను విడుదల చేసిందన్నారు. పలు అంశాలపై అధికారులతో సమీక్షలో వివరంగా చర్చించారు. సమావేశంలో ట్రాన్స్కో డైరెక్టర్లు, ఆర్టీసీ ఈడీ రవి వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.
