Hyderabad Chennai Bullet Train | చెన్నైతో ఆర్థిక అనుసంధానం

Hyderabad Chennai Bullet Train | చెన్నైతో ఆర్థిక అనుసంధానం

Hyderabad Chennai Bullet Train | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: దక్షిణ భారతదేశ రవాణా రంగ చరిత్రలో కీలక అధ్యాయానికి నాంది పలికేలా హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిన ఈ కారిడార్‌కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కారిడార్ అమరావతి రాజధాని ప్రాంతం మీదుగానే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దాదాపు 760 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ హైస్పీడ్ రైలు మార్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించనుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది. ప్రారంభంలో ఈ కారిడార్‌ను గుంటూరు జిల్లా రావెల సమీపంలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని తీసుకెళ్లాలని నిర్ణయించారు. తాజా సమీక్షల్లో ఈ మార్గం అమరావతి రాజధాని ప్రాంతానికి, విజయవాడ నగరానికి కొంత దూరంగా వెళ్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. రాజధాని నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కారిడార్‌ను నేరుగా అమరావతి మీదుగానే తీసుకెళ్లాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో భవిష్యత్తులో అమరావతి బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌కు కీలక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమరావతిలోనే తొలి స్టేషన్

డీపీఆర్ తుది రూపం దాల్చిన తర్వాత స్టేషన్ల స్థానాలు ఖరారవుతాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం రాజధాని ప్రాంతంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైలు స్టేషన్ ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది జరిగితే అమరావతికి జాతీయ స్థాయి కనెక్టివిటీ పెరగనుంది. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

ఐటీ, ఫైనాన్షియల్, సర్వీస్ రంగాల విస్తరణతో పాటు స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) వ్యాపారం ఊపందుకుని భూముల విలువలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, బుల్లెట్ రైలు సమీకరణ వంటి అంశాలతో ఫార్మా, బయోటెక్ రంగాలకు లాజిస్టికల్ సౌలభ్యం కలుగుతుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బెంగళూరు, చెన్నై మార్కెట్లతో వేగవంతమైన అనుసంధానం కూడా కానుంది.

తెలంగాణకు భారీ లాభం

కారిడార్ మార్గం ఖరారైన తర్వాత నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు సమీపంలో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కనెక్టివిటీ పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుంది. బుల్లెట్ రైలు కారిడార్ అమరావతి మీదుగా వెళ్తే రాజధాని నిర్మాణానికి కొత్త ఊపు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి అభివృద్ధి అంశం రాజకీయ, ఆర్థిక చర్చల్లో ప్రధానంగా నిలిచింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మెట్రో ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.

పారిశ్రామిక పెట్టుబడుల ప్రయోజనం పొందే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై మధ్య రైలు ప్రయాణానికి 10 నుంచి 13 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం సుమారు 4 నుంచి 5 గంటలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు దక్షిణ భారత ప్రాంతాలతో మరింత వేగవంతమైన అనుసంధానం ఏర్పడనుంది. పెరుగుదలతో పాటు విద్యా, వైద్య కేంద్రాల విస్తరణ, నూతన ఉపాధి అవకాశాలు, జాతీయ స్థాయి రవాణా హబ్‌గా ఎదగడం వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

చెన్నైతో ఆర్థిక అనుసంధానం

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక, ఆటోమొబైల్, పోర్టు నగరాల్లో చెన్నై ఒకటి. హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ కారిడార్ ద్వారా మూడు ప్రధాన ఆర్థిక కేంద్రాలు ఒకే రవాణా వ్యవస్థలో అనుసంధానం కానున్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో పరిశ్రమల విస్తరణకు అవకాశం కల్పిస్తుందని, ఎగుమతుల పెరుగుదలకు, పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. డీపీఆర్ పూర్తయిన తర్వాతే కచ్చితమైన వ్యయం, స్టేషన్ల సంఖ్య, మార్గం తుది రూపం దాల్చనున్నాయి.