Raptadu విద్యుత్ సమస్యలపై సునీత ఫోకస్..

Raptadu విద్యుత్ సమస్యలపై సునీత ఫోకస్..

మంత్రికి వినతిపత్రం

రాప్తాడు(Raptadu), ఆంధ్రప్రభ: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు పలువురు మంత్రులను కలిసి నియోజకవర్గాల సమస్యలపై చర్చించారు.

రాప్తాడు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సునీత, కొత్త సబ్‌స్టేషన్ల మంజూరు, పెండింగ్‌లో ఉన్న 485 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఆమోదం, 1,520 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే 366 కిలోమీటర్ల ఎల్‌టీఈ లైన్లు, 161 కిలోమీటర్ల కండక్టర్లు, 4,800 విద్యుత్ స్తంభాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆరు మండలాల్లో ఖాళీగా ఉన్న విద్యుత్ శాఖ ఏఈ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఆరు సెక్షన్లలో విద్యుత్ సేవలను మెరుగుపరచేందుకు ఒక్కో సెక్షన్‌లో ఐదారు మంది ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం అవసరమని తెలిపారు. కారుణ్య నియామకాల అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కూడా పరిటాల శ్రీరామ్ తరఫున మంత్రి గొట్టిపాటికి వివరించారు. ధర్మవరం రూరల్, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు.

ఎమ్మెల్యే సునీత ప్రతిపాదనలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంశాలను వెంటనే పరిశీలించాలని విద్యుత్ సంస్థ సీఎండీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రెండు నియోజకవర్గాల తరఫున సీఎండీకి కూడా వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే పరిటాల సునీత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్‌సీపీ నేతలకు కనిపించడం లేదని విమర్శించారు.

అమరావతి, పోలవరం, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని జీర్ణించుకోలేకనే వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే సునీత తెలిపారు.

Leave a Reply