సర్.. సర్వేలో మీ సహకారం భేష్!
- మున్ముందు ఇదే సహకారాన్ని అందించండి
- ఈ నెల 31వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ
- ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ
- ప్రతి దరఖాస్తును అత్యంత పారదర్శకంగా పరిష్కరిస్తాం
- అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా ప్రచురణ
- రాజకీయ పార్టీల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ , ఆంధ్రప్రభ : ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో కీలక దశ అయిన ఇంటింటి సర్వే ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు అందించిన సహకారం అభినందనీయమని.. ఇదే భాగస్వామ్య స్ఫూర్తిని క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం ప్రక్రియలోనూ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 17,13,445 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 15,89,731 ఫారాలను డిజిటైజేషన్ చేసినట్లు తెలిపారు. 55,813 డెత్ కేసులతో సహా శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాల వల్ల 1,23,714 ఫారాల సేకరణ వీలుపడలేదన్నారు.
ఈ ప్రక్రియపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ నెల 31న ముసాయిదా జాబితాను ప్రచురించడం జరుగుతుందని.. ఇది పోలింగ్ కేంద్రాలు, బీఎల్వోల వద్ద అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ముసాయిదా జాబితాలో పేర్లను సరిచూసుకోవచ్చని.. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30వ తేదీ వరకు ఆధారాలతో ఈఆర్వో లేదా ఏఈఆర్వోలకు దరఖాస్తు ద్వారా తెలియజేయవచ్చన్నారు.
ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు నోటీసుల దశతో పాటు క్లెయిములు, అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో సరిదిద్దిన తర్వాతే అక్టోబర్ 3న తుది జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు. ఈ షెడ్యూలుపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
ఫారం 6 ద్వారా కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు..
కొత్తగా ఓటు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. వివరాల్లో సవరణ కోసం లేదా ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి పేరును బదిలీ చేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఓటర్లకు సహకరించే విధంగా ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల వద్ద సహాయ కేంద్రాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. అవసరమైన ఫారం 6, ఫారం 7, ఫారం 8లు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. అందువల్ల అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు వై.రామయ్య (తెదేపా), వై.ఆంజనేయరెడ్డి (వైఎస్ఆర్సీపీ), జె.శ్రీనివాస్ (జనసేన), కె.గణేష్ (బీజేపీ), డీవీ కృష్ణ (సీపీఎం), పి.హరికృష్ణ (ఆప్) పాల్గొన్నారు.
