హ్యాకర్ల చేతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా..

  • డార్క్ వెబ్ లో డేటా..
  • బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్ దాడి..
  • ఆందోళ‌న‌లో క‌స్ట‌మ‌ర్లు

ఆంధ్రప్రభ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్… బ్యాంక్ ఆఫ్ బరోడాపై సైబర్ దాడి జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బ్యాంకుకు చెందిన భారీ మొత్తంలో డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు సమాచారం. తొలుత సుమారు 1 టెరాబైట్ (టీబీ) డేటా లీక్ అయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు… ఈ ఘటనపై సంబంధిత సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

ఉద్యోగి ఈ-మెయిల్ హ్యాక్

లీక్ అయిన డేటాలో వినియోగదారుల పేర్లు, ఆధార్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, రుణాలకు సంబంధించిన పత్రాలు, బ్రాంచ్ ఆడిట్ నివేదికలు, అంతర్గత మెమోలు, అధికారిక కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఫైళ్లు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో బ్యాంకు వినియోగదారులలో ఆందోళన నెలకొంది.

అయితే, ఈ ఘటనపై బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారికంగా స్పందించింది. ఒక ఉద్యోగి ఈమెయిల్ ఖాతా హ్యాక్ అయ్యింద‌ని తెలిపింది. దాంతో కొంత సమాచారాన్ని సైబ‌ర్ నేర‌గాళ్లు అనధికారికంగా యాక్సెస్ చేయడం జరిగిందని ఆ బ్యాంక్ పేర్కొంది. అయితే, తమ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఎటువంటి ప్రభావం పడలేదని, అలాగే వినియోగదారుల లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలు సురక్షితంగా ఉన్నాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

ఈ ఘటనను గుర్తించిన వెంటనే భద్రతా చర్యలు చేపట్టామని, ప్రస్తుతం ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. అలాగే, నియంత్రణ సంస్థలు, సంబంధిత దర్యాప్తు సంస్థల సహకారంతో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు కూడా తెలిపారు.

దాడి వెనుక ఎవరు?

ఈ సైబర్‌దాడికి ఇప్పటివరకు ఏ హ్యాకింగ్ గ్రూపు కూడా అధికారికంగా బాధ్యత వహించలేదు. అయితే, అంతర్జాతీయంగా చురుకుగా ఉండే “ట్రిపుల్ ఎక్స్” అనే హ్యాకింగ్ గ్రూపు ప్రమేయం ఉందని సైబర్ భద్రతా నిపుణులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.

ఖాతాదారులకు సూచనలు

ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, ఈ-మెయిల్స్‌ను నమ్మకూడదని, ఓటీపీలు, ఏటీఎం పిన్‌లు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో జరిగే లావాదేవీలను తరచుగా పరిశీలిస్తూ, ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.