Kyathampally | సింగరేణి ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు

Kyathampally | సింగరేణి ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు

  • విజయవంతమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స..
  • చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన రోగి తార

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో మరోసారి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిరూపితమైంది. ఆసుపత్రిలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తార అనే రోగి పూర్తిగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.

వైద్యుల వివరాల ప్రకారం, శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడటంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా నడవగలుగుతున్నారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సను ఆర్థోపెడిక్ నిపుణులు డా. విక్రమ్, డా. నరేష్ పర్యవేక్షణలో నిర్వహించారు.

అనస్థీషియా, నర్సింగ్, ఫిజియోథెరపీ విభాగాల సమన్వయంతో అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రోగి చికిత్స, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో వైద్య సిబ్బంది నిబద్ధత, నైపుణ్యం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డివైసీఎం&ఓ (అడ్మిన్) డా. ఎం. మధుకుమార్ మాట్లాడుతూ, సింగరేణి ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య సేవల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నాణ్యమైన చికిత్స పొందవచ్చని అన్నారు.

ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంలో సహకరించిన సీఎంఓ డా. కిరణ్ రాజు, ఏరియా జనరల్ మేనేజర్ ఎం. రాధాకృష్ణలకు ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, ఇతర సిబ్బంది కృషిని అభినందించింది.

Leave a Reply