గోడలపై రంగులతో పర్యావరణ సందేశం..

స్క్రాప్ థీమ్ పార్కులో వినూత్న వాల్ ఆర్ట్

హిందూపురం, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని చౌడేశ్వరి కాలనీలో అభివృద్ధి చేస్తున్న వినూత్న ‘స్క్రాప్ థీమ్’ పార్కులో గురువారం సామూహిక వాల్ ఆర్ట్ పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని చిన్నారులు, మహిళలను ప్రోత్సహించారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు 400 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, స్వచ్ఛత వంటి అంశాలను ప్రతిబింబించే చిత్రాలను పార్కు గోడలపై రంగురంగులుగా చిత్రించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చిన్నారులతో ముచ్చటించి వారు గీసిన చిత్రాల వెనుక ఉన్న భావాలను తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన తమ ఆలోచనలను కళారూపంలో వ్యక్తపరుస్తున్న చిన్నారులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో పర్యావరణంపై బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

స్క్రాప్ పదార్థాలతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు పర్యావరణహిత సందేశాన్ని ప్రజలకు చేరవేయడంలో ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. వాల్ ఆర్ట్ కార్యక్రమం ద్వారా పార్కు మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు పర్యావరణ చైతన్యానికి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మెప్మా పీడీ నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.