జాబ్ క్యాలెండర్‌పై సంబరాలు…

జాబ్ క్యాలెండర్‌పై సంబరాలు…

టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత హర్షం
ఎన్టీఆర్ భవన్‌లో మిఠాయిల పంపిణీ
ఉద్యోగావకాశాలపై ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం
మాజీ సీఎం జగన్ పాలనపై విమర్శలు

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు స్వాగతం పలుకుతూ తెలుగు నాడు విద్యార్థి సంఘం (టీఎన్ఎస్ఎఫ్), తెలుగు యువత నాయకులు విజయవాడలో సంబరాలు నిర్వహించారు. గురు నానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌తో పాటు విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో మిఠాయిలు పంచుకుని ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ, నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్లు విడుదల కావడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం గడిచిన 20 నెలల్లోనే 2,83,375 ఉద్యోగాలు కల్పించి తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని వెల్లడించారు.

ఇక గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిరుద్యోగులకు తగిన అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పెరిగాయని పేర్కొన్నారు. జగన్ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు కలిగించడానికేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్. మాధవ్, తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు రాజేష్, నాయకుడు అల్లాడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.