ఖమ్మంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రజల తరఫున పోరాడుతున్నారని కొనియాడారు.

రాహుల్ గాంధీ దేశ భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నారని, ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన విజయవంతంగా కొనసాగుతోందని, పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో ఖమ్మం నగరం మరింత అందంగా, అభివృద్ధి చెందిన నగరంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, మాజీ మేయర్ పునుకొల్లు నీరజ, అశ్రీఫ్, మార్కెట్ డైరెక్టర్ లతీఫ్, నాయకులు బాణాల సైదులు, బాణాల లక్ష్మణ్, సాదే శంకర్, నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.