బుల్లెట్ రైలుతో పుట్టపర్తి అభివృద్ధికి స్వర్ణయుగం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి, ఆంధ్రప్రభ: హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్‌ను ధర్మవరం–పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన పుట్టపర్తి అభివృద్ధికి స్వర్ణయుగానికి నాంది పలికే నిర్ణయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే పుట్టపర్తికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించడంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ధర్మవరం–పుట్టపర్తి మార్గాన్ని హైస్పీడ్ రైలు కారిడార్‌కు అనువైన మార్గంగా ప్రతిపాదించడం దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ మార్గం ద్వారా దేశ, విదేశాల నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది వచ్చే శ్రీ సత్యసాయి భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పుట్టపర్తి దేశంలోని ప్రధాన నగరాలతో అత్యాధునిక రవాణా వ్యవస్థ ద్వారా అనుసంధానమైతే ప్రపంచ పర్యాటక పటంలో మరింత ప్రాధాన్యం పొందుతుందని తెలిపారు.
కూటమి ప్రభుత్వ హయాంలో పుట్టపర్తి సమగ్రాభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రతిపాదిత యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు, అమడగూరులో రిలయన్స్ సోలార్ ప్రాజెక్టు, బుక్కపట్నం చెరువులో బోటింగ్ అభివృద్ధి, “సత్యసాయి సాగరమాల” పర్యాటక ప్రణాళిక వంటి కార్యక్రమాలకు బుల్లెట్ రైలు ప్రాజెక్టు తోడైతే జిల్లా అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ హైస్పీడ్ రైలు కారిడార్ వల్ల పుట్టపర్తితో పాటు ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, కదిరి, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాలు, ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం ప్రయోజనం పొందుతుందని తెలిపారు. ధర్మవరం పట్టు చీరల పరిశ్రమకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెరగడంతో పాటు లేపాక్షి ఆలయం, తిమ్మమ్మ మర్రిమాను, కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, యోగి వేమన క్షేత్రం వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
రవాణా సౌకర్యాల విస్తరణతో కొత్త పరిశ్రమలు, ఐటీ, సేవారంగ సంస్థలు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని, పుట్టపర్తి విమానాశ్రయం, ప్రతిపాదిత విమానాల తయారీ కేంద్రం, హైస్పీడ్ రైలు వంటి మౌలిక వసతులు ఒకే ప్రాంతంలో అందుబాటులోకి రావడం వల్ల శ్రీ సత్యసాయి జిల్లా దేశంలోనే కీలక పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక నిర్ణయానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
