పెద్దజట్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆదివారం ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడంతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వాకిటి వెంకటేష్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలోని 11, 12 వార్డుల్లో డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితే వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల వంటి రంగాల్లో దశలవారీగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామ ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, వార్డు సభ్యులు, నాయకులు శంకరప్ప, అశోక్, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.