స్వచ్ఛ తిరుపతికి అందరం కలిసి పనిచేద్దాం

  • చెత్తను రీసైక్లింగ్‌ చేసేందుకు సంస్థలు ముందుకు రావాలి
  • ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి: ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతిని పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. స్వచ్ఛ తిరుపతి కార్యక్రమంలో భాగంగా కపిలతీర్థం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తిరుపతిని శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన ఏఆర్‌ ఎకోసిస్‌ సంస్థకు పులివర్తి నాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలోనే కాకుండా చంద్రగిరిలోనూ చెత్తను రీసైక్లింగ్‌ చేసేందుకు సంస్థ ముందుకు రావాలని కోరారు. సంస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

తిరుపతి కేవలం ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శంగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పులివర్తి నాని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు.

స్వచ్ఛ తిరుపతిలో భాగంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానాన్ని ప్రతిరోజూ అమలు చేయాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, తద్వారా స్వచ్ఛ తిరుపతి కార్యక్రమానికి ప్రతి పౌరుడు తన వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

‘నా ఇల్లు.. మన వీధి.. మన తిరుపతి శుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ తిరుపతి సాధ్యం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని నాని అన్నారు. అందరం కలిసి పనిచేసి తిరుపతిని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌, ఏపీ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ చైర్మన్‌ సుగుణమ్మ, ఏఆర్‌ ఎకోసిస్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.