యూజీసీ-నెట్ రీ-టెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్..

మూడు సబ్జెక్టులకు అదనపు ఫీజు లేదు
పేపర్ తయారీ విధానంలో మార్పులు..
తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు: ఎన్‌టీఏ

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: యూజీసీ-నెట్ పరీక్షలో మూడు సబ్జెక్టులకు రీ-టెస్ట్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు జరిగే ఈ పునఃపరీక్షకు అభ్యర్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని తెలిపింది. రీ-టెస్ట్ కారణంగా అర్హత సాధించే అభ్యర్థుల సంఖ్య, సబ్జెక్టుల వారీగా కేటాయింపుల్లో ఎలాంటి తగ్గింపు ఉండదని అధికారులు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల్లో లోపాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.

ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో పలు తప్పులు, పునరావృత ప్రశ్నలు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్‌టీఏ కమిటీని ఏర్పాటు చేసింది. న్యాయమైన, లోపరహిత పరీక్ష నిర్వహణ కోసం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంగ్లిష్, కామర్స్ రీ-టెస్ట్ సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్ష సెప్టెంబర్ 10న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాల తయారీ, పరిశీలన, అనువాదం, రూపకల్పన దశల్లో అంతర్గత విధానాలను మరింత బలోపేతం చేస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.

మరోపక్క యూజీసీ-నెట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ఆధ్వర్యంలో ఎన్‌టీఏకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పరీక్షలో జరిగిన తప్పిదాలకు విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆరోపించారు. పరీక్ష నిర్వహణలో బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.