ప్రజల ఆకాంక్షలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్

పరకాల, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించి, పరకాల ప్రజల చిరకాల ఆకాంక్షలు, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా చేశారని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్ ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నించే బీజేపీ నాయకులను అరెస్టు చేయించడం ద్వారా సాధించేది ఏమిటని మేఘనాథ్ ప్రశ్నించారు.

కనీసం తమను అరెస్టు చేయించినా పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల కోరికను ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏమిటో ప్రజలకు తెలిసేదని అన్నారు. పరకాల ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా ఎమ్మెల్యేను అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలా, లేక ఏదైనా రాజకీయ లాబీనా అని నిలదీశారు. పరకాలకు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైద్య, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాల వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.

గతంలో ధర్మారెడ్డి హయాంలో పరకాలపై ఉన్న నిర్లక్ష్యమే ఇప్పుడు కూడా కొనసాగుతోందని విమర్శించారు. నడికుడ పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై ఎందుకు మాట్లాడలేదని మేఘనాథ్ ప్రశ్నించారు. మండలంగా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా నడికుడలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాలేదని, స్థానిక ప్రజలు పోలీస్ స్టేషన్ కోసం కోరడం వారి నేరమా అని అన్నారు. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం, ఉద్యోగ కల్పన వంటి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.

టెక్స్‌టైల్ పార్క్‌కు మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం ద్వారా నిధులు కేటాయించిన విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మేఘనాథ్ అన్నారు. గతంలోనే శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మళ్లీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం ఎందుకని ప్రశ్నించారు. పీఎం-ఉష పథకం కింద మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తయిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో అవసరమైన మౌలిక వసతులు ఎంతవరకు కల్పించారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

పరకాల ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి విషయంలోనూ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని కోరారు. ఆసుపత్రి ప్రారంభం కోసం బీజేపీ ఉద్యమాలు చేసిన సమయంలో మౌలిక వసతులు పూర్తిగా లేవని ఎమ్మెల్యే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించారని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఉన్నాయా, వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాలను ఎమ్మెల్యే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పరకాల ప్రజలు పక్క నియోజకవర్గం నుంచి వచ్చినప్పటికీ ఎమ్మెల్యేను గెలిపించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని మేఘనాథ్ తెలిపారు.

అయినప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వరంగల్ విమానాశ్రయం, కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో చేపడుతున్న భూగర్భ మురుగునీటి పారుదల వంటి అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వమే చేసినట్లుగా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను అరెస్టు చేయించడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరని మేఘనాథ్ స్పష్టం చేశారు. పరకాల ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.