కామారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా..

  • మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్..
  • లింగంపేట్ ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారితీసింది. లింగంపేట్‌లో ధర్నాకు వెళ్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను పోలీసులు కామారెడ్డిలో హౌస్ అరెస్ట్ చేశారు. జాజాల సురేందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున జాజాల ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ధర్నా ముగించుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్ ఆధ్వర్యంలో నాయకులు జాజాల ఇంటికి చేరుకున్నారు.

అనంతరం జాజాల సురేందర్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకురావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులను తోసుకుంటూ బీఆర్ఎస్ నాయకులు ముందుకు సాగారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు పాత జాతీయ రహదారిపైకి చేరుకుని ఇంటర్నేషనల్ హోటల్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో లేకపోయినా షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించామని గుర్తు చేశారు.

అలాంటి పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయడం ఇష్టం లేక తమకు అనుకూలమైన వ్యక్తులతో కోర్టులో కేసు వేయించిందని ఆరోపించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే కోర్టు ఆరు వారాల పాటు పథకాలను నిలిపివేసిందని అన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే పథకాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వెంటనే కోర్టులో కౌంటర్ దాఖలు చేసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్న సమయంలో కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారా, ఎమ్మెల్యే చెప్పారా అని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి ఉద్యమాల గడ్డ అని, ఉద్యమాలు చేసిన చరిత్ర తమదని పేర్కొన్నారు. ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా భయపడేది లేదని జాజాల సురేందర్ స్పష్టం చేశారు.